India: అందరికీ కరోనా నెగటివ్.. రంగంలోకి దిగిన మన క్రికెటర్లు!
- తొలగిన ఆరంభ విఘ్నాలు
- ఆటగాళ్లంతా నెట్ ప్రాక్టీస్ కు
- ఇప్పటికే మొదలు పెట్టిన ఇంగ్లండ్ ప్లేయర్స్
ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ కు ఆరంభ విఘ్నాలు తొలగిపోయాయి. బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్ రావడంతో, వారంతా బయో బబుల్ లోకి వెళ్లిపోయారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆటగాళ్లు ఎవరికీ కరోనా లేదని తేలింది. ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఆటగాడి నుంచి మూడు సార్లు నమూనాలను సేకరించి పరిశీలించారు. అన్నింటిలోనూ నెగటివ్ వచ్చిందని, దీంతో టెస్ట్ సిరీస్ ఎటువంటి సమస్య లేకుండా ప్రారంభం కానుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇక తొలి టెస్ట్ కు ముందు రెండు జట్లకూ మూడు రోజుల నెట్ ప్రాక్టీస్ కు అవకాశం ఉండగా, నేటి నుంచి గురువారం వరకూ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. నిన్న సాయంత్రమే కీలక ఆటగాళ్లు అవుట్ డోర్ ప్రాక్టీస్ కు రాగా, నేటి నుంచి మొత్తం ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ కు రానున్నారని అటు బీసీసీఐ, ఇటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ పేర్కొంది.
శ్రీలంక టూర్ కు గైర్హాజరై, నేరుగా ఇండియాకు చేరుకున్న జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బర్న్స్ తదితరులు, ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకుని, ప్రాక్టీస్ లో దిగారు. కాగా, ఈ నెల 5న తొలి టెస్ట్ చెన్నైలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టులు చెన్నైలో, చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్ లో జరగనున్నాయి. ఆసీస్ తో జరిగిన సీరీస్ లో సాధించిన విజయంతో భారత జట్టు ఉత్సాహంలో ఉండగా, శ్రీలంకను వైట్ వాష్ చేసిన ఆత్మ విశ్వాసంతో ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగుతోంది.