Atchannaidu: నేను హోం మంత్రిని అవుతా... తప్పుడు కేసులు పెడుతున్న పోలీసుల సంగతి చూస్తా: అచ్చెన్నాయుడు
- చంద్రబాబును ఒప్పించి హోం మంత్రిని అవుతా
- పోలీసులంటేనే విరక్తి కలుగుతోంది
- డీఎస్పీ, సీఐ నా బెడ్రూమ్ లోకి వచ్చారు
పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని... ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ విపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రేపు అధికారం టీడీపీదేనని, తాను హోం మంత్రిని అవుతానని, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబును ఒప్పించి హోం మంత్రిని అవుతానని చెప్పారు.
తన స్వగ్రామం నిమ్మాడలో దౌర్జన్యం చేశారంటూ పోలీసులు అచ్చెన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, నోటీసులు ఇస్తే తానే స్టేషన్ కు వచ్చేవాడినని చెప్పారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... వారంటేనే విరక్తి కలుగుతోందని తెలిపారు. డీఎస్పీ, సీఐ తన బెడ్రూమ్ లోకి వచ్చారని మండిపడ్డారు.
నాయకులను తాను తప్పుపట్టడం లేదని, పోలీసుల తీరును మాత్రమే విమర్శిస్తున్నానని చెప్పారు. వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. తాను చట్టాన్ని, ధర్మాన్ని ఆచరించే వ్యక్తినని తెలిపారు. అచ్చెన్నను అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు.