Lok Sabha: విపక్షాల ఆందోళనలతో లోక్ సభ రేపటికి వాయిదా
- వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సభ్యుల నినాదాలు
- హుందాగా వ్యవహరించాలన్న స్పీకర్ ఓంబిర్లా
- రెండుసార్లు వాయిదా పడిన లోక్ సభ
- మూడోసారి సమావేశమైనా అదే పరిస్థితి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభ రేపటికి వాయిదా పడగా, లోక్ సభ కూడా అదే బాటలో నడిచింది. లోక్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ విపక్షాల సభ్యులు బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభా కార్యకలాపాలు నిర్వహించడానికి ఆటంకం ఏర్పడింది.
ఈ క్రమంలో కనీసం పట్టుమని ఐదు నిమిషాలు కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల ఆందోళనతో లోక్ సభ రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి భేటీ తర్వాత కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. హుందాగా వ్యవహరించి సభా మర్యాదలను కాపాడాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వెల్ వద్దకు వెళ్లిన సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.