Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ రాయపాటిని బెదిరించిన కేసు.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు
- ఎఫ్ఐఆర్‌లో తొలుత పిటిషనర్ పేరును చేర్చలేదన్న నిందితుడి తరపు న్యాయవాది
- దర్యాప్తు పూర్తికావడంతో బెయిలు మంజూరు చేయాలని అభ్యర్థన
- కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి కోర్టు ఆదేశం
సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో ముందస్తు బెయిలు కోరుతూ నిందితుడు సుకాశ్ చంద్రశేఖర్ హైకోర్టును ఆశ్రయించాడు. నిన్న విచారణ జరగ్గా నిందితుడి తరపు న్యాయవాది నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో తన క్లయింట్‌ను తొలుత నిందితుడిగా పేర్కొనలేదని, ఆ తర్వాత అతడి పేరును చేర్చారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి బెయిలు మంజూరైందని, ఈ కేసులో దర్యాప్తు కూడా పూర్తయిందని, కాబట్టి ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.
స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐని ఆదేశించింది. అనంతరం ఈ నెల 11కు విచారణను వాయిదా వేసింది. కాగా, నిందితుడు ఇటీవల బెయిలు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అతడిపై దేశవ్యాప్తంగా 24 కేసులు ఉన్నాయని, కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యక్తిగత సహాయకుడి పేరుతో జైలులో సకల సౌకర్యాలు పొందడం, ఎంపీల పేరుతో మోసం చేయడం వంటి కారణాలతో బెయిలు నిరాకరించింది.