Navalny: రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీకి రెండేళ్ల జైలు శిక్ష.. పెద్ద ఎత్తున ప్రజల నిరసనలు
- తనపై అధికార పార్టీ కుట్రకు పాల్పడుతోందన్న నావల్నీ
- కోర్టు తీర్పుపై తాము అప్పీలు చేస్తామని వ్యాఖ్య
- ఈ తీర్పు దారుణమన్న బ్రిటన్, అమెరికా, జర్మనీ
జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి మాస్కోలోని షెరెమెటివో విమానాశ్రయంలో అడుగు పెట్టగానే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలెక్సీని అరెస్టు చేయడం పట్ల ప్రపంచ దేశాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ విచారణ జరిపిన మాస్కో కోర్టు ఆయనకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించడం గమనార్హం.
గతంలో ఆయనకు విధించిన శిక్షను రద్దు చేయగా, అనంతరం అందుకు సంబంధించిన షరతులను ఆయన ఉల్లంఘించారని, ఈ నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం నావల్నీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై అధికార పార్టీ కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు.
మరోపక్క, తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను లోదుస్తుల్లో విషం పెట్టే వ్యక్తిగా నావల్నీ అభివర్ణించారు. కోర్టు తీర్పుపై తాము అప్పీలు చేస్తామని చెప్పారు. గతంలో ఆయనపై రష్యా ప్రభుత్వం విష ప్రయోగం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆయనకు శిక్ష విధించడంతో ఇందుకు నిరసనగా మాస్కో సహా రష్యా వ్యాప్తంగా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
నావల్నీకి శిక్ష విధించిన నేపథ్యంలో మరోసారి రష్యా ప్రభుత్వ తీరుపై ప్రపంచం దేశాల నేతలు విమర్శలు గుప్పించారు. కోర్టు తీర్పుతో విశ్వసనీయత అన్నది పరాజయం పాలైందని మానవ హక్కుల సంస్థ కౌన్సిల్ ఆఫ్ యూరప్ చెప్పింది. ఈ తీర్పు దారుణమని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ అన్నారు. జర్మనీ, అమెరికా వంటి దేశాలూ కోర్టు తీర్పుని ఖండించాయి.