Kishan Reddy: రైతుల నిరసనలతో రాజధానికి తీవ్ర అసౌకర్యం: కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Great Inconvenience for Delhi People Says Kishan Reddy

  • అత్యవసర పనుల కోసం వచ్చే వారికి కూడా ఇబ్బందులు
  • ఆర్థికంగానూ నష్టపోతున్న హస్తిన
  • లిఖితపూర్వక సమాధానంలో కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కారణంగా రాజధాని వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఇరుగు పొరుగు రాష్ట్రాల వాసులు కూడా హస్తినకు రాలేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారని, దీంతో ఇతరులు, అత్యవసర పనుల నిమిత్తం వచ్చే వారు కూడా రాలేక పోతున్నారని అన్నారు.

"ఘాజీపూర్, చిల్లా, తిక్రి, సింఘూ సరిహద్దుల నుంచి ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాలనూ మూసివేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో రాజధాని ప్రజలకు అసౌకర్యంగా ఉంది. అంతే కాదు... ఆర్థికంగా ఏర్పడుతున్న నష్టమూ పెరిగిపోతోంది. ఇది ప్రభుత్వ ఖజానాపైనా ప్రభావం చూపుతోంది" అని తానిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కిషన్ రెడ్డి తెలిపారు. శివసేనకు చెందిన సభ్యుడు అనిల్ దేశాయ్ ప్రశ్నిస్తూ, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందా? అని ప్రశ్నించగా, హోమ్ శాఖ తరఫున కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

కాగా, సరిహద్దుల నుంచి ఎవరూ రాజధానిలోకి ప్రవేశించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రోడ్లపై సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసి, వాటిపై మేకులు గుచ్చి, రైతుల వాహనాలు రాకుండా చేయడంతో పాటు ఐదంచెల గోడలను కిలోమీటరు పరిధిలో ఏర్పాటు చేశారు. 6వ తేదీన రైతులంతా న్యూఢిల్లీలోకి వచ్చి ర్యాలీ చేస్తామని, దేశవ్యాప్తంగా రహదారులను దిగ్భంధిస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలకు దిగారు.

ఇక పోలీసుల తాజా చర్యలపై స్పందించిన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ, "ఇంకేమి చేయగలము... జనవరి 26న జరిగిన ఘటనలతో నేను ఆశ్చర్యపోయాను. రైతులు తమ ట్రాక్టర్లతో వచ్చి బారికేడ్లను విరగ్గొట్టారు. దీన్ని మేము ఊహించలేదు. ట్రాక్టర్లు దూసుకుని వస్తుంటే,  పోలీసులు ఏమి చేయగలరు? అందుకే బారికేడ్లను మరింత బలంగా నిర్మించాలని భావించాం. ట్రాక్టర్లపై నిరసనకారులు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలన్నదే మా ఉద్దేశం" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News