Gram Panchayat Elections: విధుల్లో గ్రామ సచివాలయ సిబ్బంది.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల పరిశీలకుడు
- తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు
- మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానన్న అధికారి
- జగన్ ఫొటోను కప్పేయాలని ఆదేశించిన వైనం
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఏపీలో శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు కొన్ని చోట్ల ఎన్నికల కోడ్ ను కొందరు ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు గ్రామ సచివాలయ సిబ్బంది విధులకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను పలు చోట్ల అతిక్రమిస్తున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకుడు అరుణ్ కుమార్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది విధులను నిర్వహిస్తున్నట్టు ఆయన గుర్తించారు.
దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు ఎవరు రమ్మన్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి మణిదీప్ ఏదో చెప్పబోతుండగా... అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నిన్ను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఇదే సమయంలో రైతు భరోసా కేంద్రం వద్ద సీఎం జగన్ ఫొటో ఉండటాన్ని గుర్తించి ఫొటోను కప్పివేయాలని అరుణ్ కుమార్ ఆదేశించారు.