Ambati Rambabu: అచ్చెన్నాయుడి బలవంతపు ఏకగ్రీవంపై నిమ్మగడ్డ ఎందుకు ప్రశ్నించడం లేదు?: అంబటి రాంబాబు
- నారా లోకేశ్ కు పైలట్ గా నిమ్మగడ్డ అక్కడకు వెళ్లారా?
- టీడీపీ కార్యాలయంలోనే ఈ-యాప్ తయారైంది
- పట్టాభిపై దాడి పేరుతో టీడీపీ నాటకాలు ఆడుతోంది
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి భర్త మరణిస్తే... అక్కడకు నిమ్మగడ్డ వెళ్లడం తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నారా లోకేశ్ కు నిమ్మగడ్డ పైలట్ గా వెళ్లారా? అని ప్రశ్నించారు. కుక్క పని కుక్క చేయాలని... గాడిద పని గాడిద చేయాలని వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడి బలవంతపు ఏకగ్రీవంపై నిమ్మగడ్డ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఎస్ఈసీ విడుదల చేసిన ఈ-యాప్ అంతా ఒక బూటకమని... టీడీపీ కార్యాలయంలో దాన్ని తయారు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ యాప్ ఉండగా... మరో యాప్ ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎస్ఈసీ ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదని అన్నారు. నిమ్మగడ్డ రాసిన లేఖలు టీడీపీ కార్యాలయంలో తయారయ్యాయనే విషయం బయటపడిందని... ఈ-యాప్ వెనుకున్న నిజాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పారు.
పట్టాభిపై దాడి పేరుతో టీడీపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టిందని అంబటి అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబును సైతం అరెస్ట్ చేయాల్సిందేనని చెప్పారు. అచ్చెన్నాయుడు ఊరకనే ఇంట్లో ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. పట్టాభిపై దాడి జరిగిందని టీడీపీ హడావుడి చేస్తోందని... కానీ, పోలీసులకు దాడిపై ఫిర్యాదు మాత్రం చేయరని మండిపడ్డారు. చంద్రబాబు ఒక చచ్చిన పాము అని అన్నారు.