Panchumarthi Anuradha: పంచాయతీ ఎన్నికలను కూడా ఎదుర్కోలేని పెద్దిరెడ్డి.. పెద్ద హీరోలా మాట్లాడుతున్నారు: పంచుమర్తి అనురాధ
- చిత్తూరు జిల్లాను పెద్దిరెడ్డి గంజాయి వనంగా మార్చేశారు
- పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదు
- మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చరిత్ర పెద్దిరెడ్డిది
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తులసివనంలాంటి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఒక గంజాయి మొక్కలా తయారయ్యారని ఆమె అన్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్ర చందనం మాఫియాలలో ఆయన కుటుంబ సభ్యులు కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికలను కూడా ఎదుర్కొనే ధైర్యం లేని పెద్దిరెడ్డి... పెద్ద హీరోలా మీడియా ముందు మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఆయనదని అన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఏం చేశారో చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్... ఎన్నో పంచాయతీ కార్యాలయాలను నిర్మించారని... ఈయన వచ్చిన తర్వాత ఆ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. నిమ్మగడ్డను తన ఇంట్లో ఎద్దుతో పోల్చిన పెద్దిరెడ్డి పెద్ద తప్పు చేశారని అన్నారు. రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టులు చేసుకుంటూ సంపాదనను పెంచుకుంటున్నారని చెప్పారు. పెద్దిరెడ్డికి తప్ప మరే కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు కావడం లేదని అన్నారు. చిత్తూరు జిల్లాను గంజాయి వనంగా మార్చేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి తన పేరును రావణరెడ్డి అని మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.