Vishnu Vardhan Reddy: సురేశ్ కి ఏమైనా జరిగితే శిల్పా చక్రపాణిరెడ్డి బాధ్యత వహించాలి: విష్ణువర్ధన్ రెడ్డి
- మాధవరం ఏకగ్రీవమయిందని శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు
- ఏకగ్రీవం కాలేదు.. మా అభ్యర్థిని కిడ్నాప్ చేశారు
- దౌర్జన్యాలతో ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటున్నారు
వైసీపీ దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నామినేషన్ల విత్ డ్రా సమయం ముగియగానే మాధవరం ఏకగ్రీవమైందని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారని... కానీ, మాధవరంలో ఏకగ్రీవం జరగలేదని ఆయన అన్నారు.
శ్రీశైలం నియోజకవర్గంలో సురేశ్ అనే వ్యక్తి పోటీ చేస్తే, ఆయనపై ఈరోజు వైసీపీ వాళ్లు దాడి చేయడం జరిగిందని చెప్పారు. ఆయనను తీసుకెళ్లి, కనపడకుండా చేశారని మండిపడ్డారు. ఆయనకు కాని, తమ కార్యకర్తలకు కాని ఏమైనా జరిగితే శిల్పా చక్రపాణిరెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించి రేపు జిల్లా ఎస్పీని కూడా కలుస్తామని చెప్పారు.
ఇలాంటి దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు అవుతున్నాయి తప్ప, మరొకటి కాదని విష్ణు అన్నారు. వైసీపీ చేయిస్తున్న ఏకగ్రీవాలన్నీ వంద శాతం దౌర్జన్యాల వల్లేనని విమర్శించారు. వీటన్నింటికీ వైసీపీ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్న వైసీపీ శ్రేణులను, జగన్ గారి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.