Narendra Modi: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్వీట్‌పై మోదీ స్పందన!
- దక్షిణాఫ్రికాకు వ్యాక్సిన్లను పంపిన భారత్
- భారత దయాగుణం పెరిగిపోతోందన్న పీటర్సన్
- భారత్ పట్ల ఆయనకున్న ప్రేమను చూసి సంతోషించానన్న మోదీ
పలు దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్‌ను పంపుతోన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాకు ఇటీవల భారత్ పంపిన వ్యాక్సిన్లకు సంబంధించిన ఫొటోను భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్వీట్ చేయగా, దానిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత దయాగుణం పెరిగిపోతోందని, అది చాలా ప్రియమైన దేశం అనీ పేర్కొన్నారు.
ఆయన చేసిన ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమను చూసి సంతోషించానని చెప్పారు. ప్రపంచమంతా కుటుంబమేనని భారత్ భావిస్తుందని తెలిపారు. కరోనాపై పోరాటంలో తమ వంతు సాయం అందిస్తామని చెప్పారు.
గతంలోనూ పీటర్సన్ భారత్‌పై పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. కాగా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకున్న విషయంపై పీటర్సన్ స్పందిస్తూ... అది సరికాదని అన్నారు.
ఒకవేళ ఇది దక్షిణాఫ్రికా పర్యటన బదులు భారత పర్యటన అయితే ఆస్ట్రేలియా జట్టు ఇలా చేసేది కాదని తెలిపారు. తమ దేశ జట్టు కూడా దక్షిణాఫ్రికా టూర్‌ను రద్దు చేసుకుందని గుర్తు చేశారు. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకినప్పటికీ అక్కడ తమ జట్టు సిరీస్ గెలిచిందని తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికాలో పుట్టిపెరిగిన పీటర్సన్ కొన్నేళ్ల క్రితం ఇంగ్లాండ్ కు వలస వచ్చి, బ్రిటన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు.