Bonda Uma: తనకు వచ్చే కలెక్షన్లలో తాడేపల్లికి వాటా ఇస్తున్నాడు కాబట్టే దేవాదాయ శాఖ మంత్రిని ఏమీ అనడంలేదు: బోండా ఉమ
- వెల్లంపల్లి శ్రీనివాస్ పై ధ్వజమెత్తిన బోండా ఉమ
- పనికిమాలిన దేవాదాయ శాఖ మంత్రి అంటూ వ్యాఖ్యలు
- అతడిపై ఒక్క చర్య కూడా తీసుకోవడంలేదని ఆగ్రహం
- తమపైనే ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
టీడీపీ నేత బోండా ఉమ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై ధ్వజమెత్తారు. పనికిమాలిన దేవాదాయ శాఖ మంత్రి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే, వాటి వెనుక కుట్ర చేస్తోంది టీడీపీయేనని ఆరోపిస్తున్నారని, మరి అధికారం మీ వద్దే ఉంది కాబట్టి దోషులను పట్టుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
లిక్కర్ లో, ఇసుకలో, మైనింగ్ లో దోచుకోవడానికి, కుంభకోణాలు చేయడానికి, అవినీతి చేయడానికి అధికారం కావాలి, ఆలయాలపై దాడులు చేయించడానికి అధికారం కావాలని, కానీ ఆలయాలపై దాడుల దోషులను పట్టుకోవడానికి అధికారాన్ని ఎందుకు ఉపయోగించరని నిలదీశారు.
"దేవుడి సేవా కార్యక్రమాలు చూపించే ఎస్వీబీసీలో పోర్న్ ఫిల్మ్ ద్వారా టీటీడీని అపవిత్రం చేశారు. శ్రీశైలంలో సేవా టికెట్లలోనూ కుంభకోణం చేశారు. సింహాచలం, అన్నవరంలో కుంభకోణాలు జరిగాయి. ఏ దేవాలయాన్ని బతకనిచ్చారు మీరు? అంతర్వేది, రామతీర్థం, బిట్రగుంట ఆలయాల్లో ఘటనలు జరిగాయి. ఇన్ని జరుగుతున్నా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. సాక్షాత్తు అమ్మవారి ఆలయంలో సింహాల ప్రతిమలు కొట్టేస్తే దిక్కులేదు. తనకు వచ్చే కలెక్షన్లలో తాడేపల్లికి వాటా ఇస్తుండడంతో అతడ్ని ఏం చేయకుండా వదిలేస్తున్నారు" అని వెల్లడించారు.