Sero Survey: డిసెంబర్ నాటికే ఇండియాలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా: ఐసీఎంఆర్ సర్వే

ICMR Survey Says One in Every 5 Have Corona by December

  • 21.4 శాతం మందిలో యాంటీ బాడీలు
  • డిసెంబర్ నుంచి జనవరి మధ్య జరిగిన సీరో సర్వే
  • టీనేజ్ బాలల్లో 25.3 శాతం మందిలో రోగ నిరోధక శక్తి

ఇండియాలో గత సంవత్సరం డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా కరోనా బారిన పడ్డారని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్వహించిన సీరోలాజికల్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. ఢిల్లీ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సీరో సర్వే నిర్వహించగా, 21.4 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయి, యాంటీ బాడీలు వృద్ధి చెందాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు.

10 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 25.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని, ఈ గణాంకాల ఆధారంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న నిర్ధారణకు వచ్చామని అన్నారు. ఆగస్టులో జరిపిన సర్వేతో పోలిస్తే, కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని కలిగివున్న వారి సంఖ్య 0.7 శాతం నుంచి 21.4 శాతానికి పెరిగిందని తెలిపారు.

ఇక 18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, టీనేజ్ లో ఉన్న వారిలో 25.3 శాతం, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం వరకూ కరోనా రోగ నిరోధక శక్తి ఉందని తమ సర్వేలో తేలిందని రాజేశ్ భూషణ్ తెలియజేశారు. మొత్తం మీద మగవారిలో 20.3 శాతం, ఆడవారిలో 22.7 శాతం మంది కరోనాను ఎదుర్కొన్నారని తెలిపారు.

హెల్త్ కేర్ విభాగానికి వస్తే, డాక్టర్లు, నర్సుల్లో 26.6 శాతం, పారామెడికల్ స్టాఫ్ లో 25.4 శాతం, ఫీల్డ్ స్టాఫ్ లో 25.3 శాతం, అడ్మిన్ స్టాఫ్ లో 24.9 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 700 పట్టణాలు, గ్రామాల్లో ఈ సర్వే జరిగిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News