E Watch App: ఈ నెల 9 వరకు ఈ-వాచ్ యాప్ ను అమల్లోకి తీసుకురావొద్దని ఎస్ఈసీని ఆదేశించిన హైకోర్టు
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు
- పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఈ-వాచ్ యాప్
- హైకోర్టును ఆశ్రయించిన సర్కారు
- తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఏపీ ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్ ను తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ పై వైసీపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఇది ప్రైవేటు యాప్ అని, తమకు నష్టం కలిగించేందుకే ఈ యాప్ తీసుకువచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ-వాచ్ యాప్ ను వాడకంలోకి తీసుకురావొద్దని ఎస్ఈసీని ఆదేశించింది.
ఈ యాప్ కు సంబంధించిన సెక్యూరిటీ సర్టిఫికెట్ ఇప్పటివరకు అందలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ వచ్చేసరికి మరో 5 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.