Sajjala Ramakrishna Reddy: నిమ్మగడ్డ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు: సజ్జల
- మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ చర్యలు
- గృహనిర్బంధంలో ఉంచాలంటూ డీజీపీకి ఆదేశాలు!
- ఏకగ్రీవాలను సాకుగా చూపి గృహనిర్బంధం విధించారన్న సజ్జల
- సిగ్గుచేటు అని వ్యాఖ్యలు
ఎన్నికల అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు, ఆపై మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికలు అయ్యేవరకు గృహనిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏకగ్రీవాలను సాకుగా చూపి మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
గతంలోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అవుతుండడంతో కరోనా సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేశారని విమర్శించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు అవుతుండడంతో ఎస్ఈసీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో డిక్లరేషన్ ఇచ్చాక ఏకగ్రీవాలను నిలిపివేయడం దారుణం అని అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవాలు తప్ప మరో కారణం కాదని సజ్జల వివరణ ఇచ్చారు.
అయినా, నిమ్మగడ్డ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని అన్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ, అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.