Peddireddi Ramachandra Reddy: తనపై ఎస్ఈసీ చర్యలపై హైకోర్టుకు తన వాదనలు వినిపించిన మంత్రి పెద్దిరెడ్డి!
- ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయి
- నోటీసు ఇవ్వకుండా చర్యలు రాజ్యాంగ విరుద్ధం
- ఈ రోజు రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారు
- ఆయనను ప్రొటోకాల్‌ను అనుసరించి ఆహ్వానించాలి
అధికారులను హెచ్చరించిన ఆరోపణలపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుని, పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు ఆయనను ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై ఈ రోజు ఉదయం విచారణ జరిగింది.
ఎస్ఈసీ ఈ నెల 6న ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని పెద్దిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా, వివరాలు తీసుకోకుండా ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ రోజు రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారని, ఆయనను ప్రొటోకాల్‌ను అనుసరించి ఆహ్వానించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. రాష్ట్రపతి చిత్తూరు వస్తుండడంతో ఆయనను ఆహ్వానించేందుకు పెద్దిరెడ్డి వెళ్తే అభ్యంతరం లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కూడా కోర్టుకు వివరించారు. దీనిపై కాసేపట్లో కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.