Flash Floods: ఉత్తరాఖండ్ లో మంచుచరియల బీభత్సం... విద్యుత్ కేంద్రంలో 150 మంది కార్మికుల గల్లంతు
- విరిగిపడిన మంచు చరియలు
- ధౌలిగంగా నదిలో పెరిగిన నీటిమట్టం
- నదికి ఒక్కసారిగా వరద
- రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తిన వరదనీరు
ఉత్తరాఖండ్ లో పెను విపత్తు సంభవించింది. మంచు చరియలు విరిగిపడడంతో ఓ విద్యుత్ కేంద్రాన్ని వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 150 మంది కార్మికులు గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. మంచు చరియల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగిపోయింది. నదికి ఆకస్మికంగా వరద రావడంతో ఆ ధాటికి దిగువన ఉన్న డ్యామ్ ధ్వంసమైంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోయింది.
ఈ క్రమంలో వరద నీరు చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద ఉన్న రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తగా, ఆ విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. అందులోని 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటీన రంగంలోకి దిగాయి. వరద నేపథ్యంలో ధౌలిగంగా నదీతీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా, సహాయక చర్యల కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఘటనాస్థలికి ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చేరుకున్నారు.