Prime Minister: భారత్ చాయ్ పేరును చెడగొడుతున్నారు: ప్రధాని మోదీ
- మన టీ ప్రతిష్ఠ తగ్గించాలని చూసి వారే మరింత దిగజారిపోయారు
- వారి వెనకున్న ప్రతి పార్టీ తేయాకు తోటల్లో పనిచేసే వారికి జవాబు చెప్పాలి
- అస్సాంలో రూ.7,700 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
- ఒక్కో మెడిసిన్, ఇంజనీరింగ్ కాలేజీల్లోనైనా ప్రాంతీయ భాషలో చదువులు చెప్పాలన్నదే తన కల అని వెల్లడి
అంతర్జాతీయ సమాజం ముందు భారత చాయ్ పేరును చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మన దగ్గర పండించే తేయాకును తక్కువ చేసి చూపిస్తూ.. వారు మరింత దిగజారిపోయారని విమర్శించారు. ప్రపంచం ముందు మన టీ పేరు ప్రతిష్టలను తగ్గించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
బయటి దేశాల్లో ఉన్న కొందరు ఆ కుట్రలు పన్నుతున్నట్టు కొన్ని పత్రాలు బయటపడ్డాయని అన్నారు. వారి వెనుక ఉన్న ప్రతి రాజకీయ పార్టీ.. తేయాకు తోటల యజమానులకు, అక్కడ పని చేసే కూలీలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా భారత్ దానిని ఎదుర్కొంటుందని చెప్పారు.
ఆదివారం అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లా ధేకియాజులిలో రూ.7,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. బిశ్వనాథ్, చారైదేవ్ లలో రెండు వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక్కో వైద్య కళాశాల, ఒక్కో ఇంజనీరింగ్ కళాశాలోనైనా స్థానిక భాషల్లోనే విద్యనందించాలన్నదే తన కల అని మోదీ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఒక వైద్య కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాలలో కచ్చితంగా అస్సామీలోనే చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు.
గువాహాటీలో ఏర్పాటు చేయబోతున్న ఎయిమ్స్ తో అస్సాం జీవిత గమ్యమే మారిపోతుందని, గత పాలకులు ఇలాంటి విషయాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. 2016 వరకు అస్సాంలో కేవలం 6 వైద్య కళాశాలలే ఉండేవని, ఈ ఆరేళ్లలో మరో ఆరు కళాశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు మరో రెండు మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్పారు. ఆయా కాలేజీలు మొదలైతే ఏటా మరో 1,600 మంది డాక్టర్లు తయారవుతారని చెప్పారు.