Undavalli Arun Kumar: స్టీల్ ప్లాంట్ పై మోదీకి జగన్ రాసిన లేఖ వల్ల ఎలాంటి ఉపయోగంలేదు: ఉండవల్లి

Undavalli Arun Kumar says no use of CM Jagan letter to PM Modi

  • తాజా పరిణామాలపై ఉండవల్లి స్పందన
  • మోదీ సర్కారు క్యాపిటలిస్టు ధోరణితో వెళుతోందని వ్యాఖ్యలు
  • 2017 నుంచి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తోందని వెల్లడి
  • జగన్ లేఖను కేంద్రం పట్టించుకోకపోవచ్చన్న ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆలోచనా విధానంతో నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోవాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు.

2017 నుంచి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని ఉండవల్లి వివరించారు. నష్టాల్లో ఉందన్న సాకుతో స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామని అనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేకంగా గనులు కేటాయిస్తే లాభాల బాట పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలపివేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని అన్నారు. ఆ లేఖను కేంద్రం పెద్దగా పట్టించుకోకపోవచ్చని తెలిపారు. వైసీపీ ఎంపీలందరూ కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తే.... బడ్జెట్ ఎంతో బాగుందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొనడం వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో తెలియడంలేదని పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారం గురించి స్పష్టంగా అడగాల్సింది పోయి, బడ్జెట్ గురించి ప్రస్తావించారని ఉండవల్లి విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేకంగా గనులు సాధించడమే తక్షణ కర్తవ్యం అని, దీనిపై అన్ని పార్టీలు చర్చించాలని సూచించారు.

  • Loading...

More Telugu News