Tamilisai Soundararajan: 'రాజ్ భవన్ అన్నం' కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
- రాజ్ భవన్ పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్
- ప్రతి ఉదయం 500 మంది పేదలకు ఉచితంగా టిఫిన్
- మధ్యాహ్నం, రాత్రి నామమాత్రపు ధరలతో భోజనం
పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈరోజు ప్రారంభించారు. 'రాజ్ భవన్ అన్నం' పేరిట ఈ కార్యక్రమాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉదయం దాదాపు 500 మంది పేదలకు టిఫిన్ ఉచితంగా అందించనున్నారు. మధ్యాహ్నం, రాత్రి నామమాత్రపు ధరలతో భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ, ఉదయాన్నే టిఫిన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెప్పారు. ప్రతి తల్లి తన పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. పౌష్టికాహారం అందిస్తే పిల్లల ఎదుగుదల బాగుంటుందని చెప్పారు. సమతుల్య ఆహారం అందిస్తే పిల్లలు శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఉంటారని అన్నారు.
ఈ సందర్భంగా రాజ్ భవన్ పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. సత్యసాయి సేవా సమితి సహకారంతో రాజ్ భవన్ పాఠశాలలో చదివే విద్యార్థులు, రాజ్ భవన్ లో పని చేసే వ్యక్తులు, చుట్టు పక్కల ఉండే పారిశుద్ధ్య కార్మికులకు రుచికరమైన అల్పాహారాన్ని అందించనున్నామని తెలిపారు.