AP High Court: ఏపీలో రేషన్ పంపిణీ వాహనాల రంగుల మార్పుపై హైకోర్టులో విచారణ
- రేషన్ పంపిణీకి వాహనాలు సిద్ధం చేసిన ఏపీ సర్కారు
- వాహనాల రంగులు, సీఎం జగన్ ఫొటోలపై ఎస్ఈసీ అభ్యంతరం
- రంగులు మార్చాలని ఆదేశం
- హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
- విచారణ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా
ఏపీలో రేషన్ పంపిణీ వాహనాల రంగులు, వాటిపై సీఎం జగన్ ఫొటోలు ఉండడంపై.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై అభ్యంతరం వెలిబుచ్చింది. దాంతో, రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
రంగుల మార్పు అంశం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. దాంతో హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, వాహనాలపై సీఎం జగన్ ఫొటోలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. రేషన్ పంపిణీ వాహనాల ఫొటోలను తమకు అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు, ఎస్ఈసీ తరఫు వాదనలు వినేందుకు ఈ విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.