Supreme Court: శశి థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులను ఇప్పుడే అరెస్ట్ చేయవద్దు: సుప్రీంకోర్టు
- రిపబ్లిక్ డే నాడు జరిగిన హింసపై ట్వీట్లు
- కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
- తాము కేసును విచారించేంత వరకు అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులను విచారణ పేరుతో ఎవరూ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును రెండు వారాల తర్వాత విచారిస్తామని చెప్పింది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ట్వీట్లు చేసిన నేపథ్యంలో వీరిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో వీరికి ఎలాంటి ఊరటను కల్పించవద్దని కోర్టును ఈయన కోరారు. మరోవైపు శశి థరూర్ తరపున కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ... సుప్రీంకోర్టు ఈ కేసును విచారించేంత వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను ఇవ్వాలని కోరారు.
చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బోపన్న, రామసుబ్రహ్మణియన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వాదనలను విన్న తర్వాత స్పందిస్తూ... తాము కేసును విచారించేంత వరకు ఏమీ జరగబోదని... దీనికి సంబంధించి నోటీసులు ఇస్తున్నామని తెలిపింది. కేసులు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల్లో రాజ్ దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండే, జాఫర్ అఘా, వినోద్ కే జోస్, పరేశ్ నాథ్, అనంత్ నాథ్ ఉన్నారు.