Corona Virus: 15 రాష్ట్రాలు, యూటీలలో ఒక్క కరోనా మృతి కూడా లేదు!
- కరోనా వైరస్ బలహీనపడుతోందన్న కేంద్ర ఆరోగ్యశాఖ
- ఢిల్లీలో కూడా నమోదు కాని మరణాలు
- అయినప్పటికీ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్న నీతి ఆయోగ్ అధికారి
అందరికీ భారీ ఊరట కలిగించే వార్త ఇది. కరోనా ప్రభావం మన దేశంలో తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో మన దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక కరోనా మరణం కూడా సంభవించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ బలహీనపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత వారంలో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సంభవించలేదు. ఇప్పుడు ఆ సంఖ్య 15కు పెరగడం గమనార్హం.
కరోనా వైరస్ ఢిల్లీని వణికించిన సంగతి తెలిసిందే. అలాంటి ఢిల్లీలో కూడా గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇది చాలా సంతోషకరమైన విషయమని నీతి ఆయోగ్ కు చెందిన ఒక కీలక అధికారి అన్నారు. కరోనా ప్రభావం తగ్గుతున్నప్పటికీ అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మన దేశంలో ఇప్పటికీ 70 శాతం మంది ప్రజలు కరోనాకు గురయ్యే అవకాశం ఉందని దేశ వ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే తెలియజేసిందని గుర్తు చేశారు.