Telugudesam: నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన టీడీపీ ఎంపీలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని పునఃపరిశీలించాలన్న ఎంపీలు
- ప్లాంట్ కు గనులను కేటాయించాలని విన్నపం
- వాజ్ పేయి చూపించిన చొరవను మళ్లీ చూపించాలన్న ఎంపీలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని ఈ సందర్భంగా ఆమెను కోరారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని... ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు.
విశాఖ ప్లాంట్ కు ప్రత్యేక ఇనుప ఖనిజ గనులను కేటాయించాలని కోరారు. విశాఖ ఉక్కును ఆదుకునేందుకు గతంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి చొరవ చూపారని... ఇప్పుడు అదే చొరవను చూపాలని విన్నవించారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. నిర్మలను కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.