UAE: అంగారక కక్ష్యలోకి నిన్న యూఏఈ వ్యోమనౌక ‘అమల్’.. నేడు చైనా వ్యోమనౌక ‘తియాన్వెన్-1’
- గతేడాది జులైలో భూమి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు
- ఏడు నెలల్లో 30 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన ‘అమల్’
- 18న అరుణగ్రహంపై కాలుమోపనున్న అమెరికా వ్యోమనౌక
అరుణగ్రహంపై ఏముందో తెలుసుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), చైనా పంపించిన వ్యోమనౌకలు ఒకదాని తర్వాత ఒకటిగా అంగారక కక్ష్యలోకి చేరుకుంటున్నాయి. గతేడాది జులైలో యూఏఈ పంపిన ‘అమల్’ వ్యోమనౌక దాదాపు ఏడు నెలలపాటు 30 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం నిన్న అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది.
దీంతో ఆ దేశ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వ్యోమనౌకలోని ప్రధాన ఇంజిన్లను 27 నిమిషాలపాటు మండించడంతో ‘అమల్’ వేగం తగ్గి అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. 15 నిమిషాల అనంతరం వ్యోమనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించినట్టు సంకేతాలు రావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు, చైనాకు చెందిన వ్యోమనౌక ‘తియాన్వెన్-1’ నేడు అంగారక కక్ష్యలోకి ప్రవేశించనుంది. అలాగే, ఈ నెల 18న అమెరికాకు చెందిన ‘పర్సివరెన్స్’ రోవర్ రెడ్ ప్లానెట్‌పై దిగనుంది. ఈ వ్యోమనౌకలు అన్నీ అంగారకుడిపై వాతావరణంపై, జీవుల మనుగడకు ఉన్న అవకాశాలపై పరిశోధన సాగిస్తాయి.