Farm Laws: సాగు చట్టాలకు వ్యతిరేకంగా పాటలు.. తొలగించిన యూట్యూబ్
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం
- నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ రెండు పాటల తొలగింపు
- నష్టమేమీ లేదన్న రైతు సంఘాలు, రూపకర్తలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం-రైతు సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఆశించిన ఫలితం లేకపోవడంతో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
మరోవైపు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా విడుదలైన రెండు పాటలను యూట్యూబ్ తొలగించింది. యూట్యూబ్లో అప్లోడ్ అయిన ‘ఫాస్లా దే ఫైస్లే కిసాన్ కరూగా’.. ‘ఆసి వాదాంగే’ తమ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ వాటిని తొలగించింది. యూట్యూబ్ చర్యపై రైతు సంఘాలు, ఆ పాటల రూపకర్తలు స్పందించారు. వాటిని తొలగించినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని, అవి ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ పాటలకు త్వరలోనే రెండో సిరీస్ కూడా విడుదల చేస్తామని చెప్పారు.