Donald Trump: ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైనా ఆయనపై బ్యాన్ ఎత్తివేయబోం: ట్విట్టర్ సీఎఫ్ఓ
- ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం శాశ్వతం
- మా విధానాలను మార్చుకోబోం
- కేపిటల్ హిల్‌పై దాడి తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై వేటు
- అభిశంసన తీర్మానంలో నిర్దోషిగా తేలితే రెండోసారి అధ్యక్ష రేసులోకి వచ్చేందుకు ట్రంప్‌కు అవకాశం
డొనాల్ట్ ట్రంప్ మరోమారు అమెరికా అధ్యక్షుడు అయినా ఆయన ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయబోమని ఆ సంస్థ సీఎఫ్ఓ నెడ్ సెగల్ తేల్చి చెప్పారు. ‘సీఎన్‌బీసీ’కి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధం శాశ్వతమని పేర్కొన్నారు. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడు అయితే ఆయన ఖాతాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
తమ విధానాలు చాలా కఠినంగా ఉంటాయని, ఒకసారి ఒకరిని తొలగించామంటే శాశ్వతంగా తొలగించినట్టేనని వివరించారు. అలా తొలగించబడిన వ్యక్తి ఎవరైనా తమ విధానాల్లో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఒకసారి తొలగించిన వ్యక్తి ఇక ఎప్పటికీ తమ ప్లాట్‌ఫాంలోకి రాలేడని సెగల్ తేల్చి చెప్పారు.
ట్రంప్ అభిశంసనపై కాంగ్రెస్‌లో విచారణ కొనసాగుతున్న వేళ ట్రంప్ సీఈవో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్‌ను కనుక నిర్దోషిగా ప్రకటిస్తే ఆయన తిరిగి అధ్యక్ష బరిలోకి దిగకుండా ఎవరూ అడ్డుకోలేరు. యూఎస్ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత హింసను మరింత ప్రేరేపించే అవకాశం ఉందన్న ఆరోపణలతో ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా మూసివేసింది.