Philippines: పట్టభద్రుడు అయ్యేలోపు ప్రతి విద్యార్థి 10 మొక్కలు నాటాల్సిందే... ఫిలిప్పీన్స్ లో కొత్త చట్టం!

Every student in Phillippines must plant ten trees towards graduation as per new law

  • 20వ శతాబ్దంలో ఫిలిప్పీన్స్ లో తీవ్రస్థాయిలో చెట్ల నరికివేత
  • భారీగా పడిపోయిన వృక్ష సంపద
  • పర్యావరణ స్పృహతో తాజా చట్టం
  • ఏటా 175 మిలియన్ల మొక్కలు నాటే అవకాశం
  • ఓ తరంలో 525 బిలియన్ల మొక్కలు పెరుగుతాయంటున్న నిపుణులు

గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం దుష్పరిణామాలు మానవాళిని అనేక రూపాల్లో పట్టిపీడిస్తున్నాయి. కాలుష్యానికి విరుగుడు చెట్ల పెంపకమేనని అనేక దేశాలు గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ హితం కోరి మొక్కలు నాటడం అనేది పలు ప్రాంతాల్లో ఉద్యమ స్థాయిలో నడుస్తోంది. ఆసియా దేశం ఫిలిప్పీన్స్ లో ఆసక్తికర చట్టం చేయడం పర్యావరణ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఫిలిప్పీన్స్ లో ప్రతి విద్యార్థి తాను పట్టభద్రుడు అయ్యేలోపు కనీసం 10 మొక్కలు నాటాలని ఆ చట్టంలో పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన బిల్లు ఫిలిప్పీన్స్ చట్టసభలో మే 15న ఆమోదం పొంది చట్ట రూపం దాల్చింది. ఓ విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని హైస్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో 10 మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆ చట్టంలో పొందుపరిచారు. ఈ విధానం వల్ల ప్రతి ఏటా 175 మిలియన్ మొక్కలు నాటే అవకాశం ఉందని, తద్వారా ఓ తరంలో 525 బిలియన్ మొక్కలు ఈ భూమిపై పెరుగుతాయని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ మొక్కలను అటవీప్రాంతాల్లోనూ, పాడుబడిన గనుల్లోనూ నాటాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఫిలిప్సీన్స్ విద్యాశాఖ పర్యవేక్షించనుంది. 20వ శతాబ్దంలో ఫిలిప్పీన్స్ లో చెట్ల నరికివేత విపరీతంగా సాగింది. దాంతో అక్కడి వృక్ష సంపద దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనూ కొత్త చట్టానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News