Vijayashanti: టీఆర్ఎస్, ఎంఐఎం సయామీ కవలలని మరోసారి నిరూపితమైంది: విజయశాంతి
- జీహెచ్ఎంసీ మేయర్ పీఠం టీఆర్ఎస్ వశం
- ఎంఐఎం మద్దతుతో మేయర్ పదవి దక్కించుకున్న టీఆర్ఎస్
- తాను గతంలోనే చెప్పానన్న విజయశాంతి
- నిజస్వరూపం బయటపడుతుందంటూ అప్పట్లోనే రాములమ్మ పోస్టు
బీజేపీ నేత విజయశాంతి జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై స్పందించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల గురించి గతంలో తాను చెప్పిందే నిజమైందని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం విడదీయలేని సయామీ కవలలని తాను డిసెంబరు 4న చేసిన వ్యాఖ్యలు ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికతో నిరూపితమయ్యాయని, ఆ రెండు పార్టీలు తమ బంధాన్ని మరోసారి బహిరంగం చేసుకున్నాయని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, గతేడాది డిసెంబరులో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయశాంతి సోషల్ మీడియాలో స్పందిస్తూ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కేలా లేదని పేర్కొన్నారు. విజయశాంతి అభిప్రాయపడినట్టే నేడు టీఆర్ఎస్ కు మేయర్ పీఠం లభించడంలో ఎంఐఎం మద్దతే కీలకంగా నిలిచింది.
ఇన్నాళ్లూ కవలల్లా కొనసాగారని, కానీ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం అవసరంలేదని టీఆర్ఎస్ నేతలు అంటే, తాము తలుచుకుంటే గులాబీ సర్కారును రెండు నెలల్లో కూల్చేస్తామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారని రాములమ్మ నాటి తన పోస్టులో వివరించారు. మేయర్ పీఠం అంశంలో ఈ రెండు పార్టీలు తమ వైఖరికి కట్టుబడి ఉంటాయా..? అని అప్పట్లోనే ఆమె సందేహం వ్యక్తం చేశారు.
మేయర్ పదవి దక్కకపోయినా ఎంఐఎంతో కలిసేది లేదని, హంగ్ వస్తే మళ్లీ ఎన్నికలకు సిద్ధమని టీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. కవలల అసలు రంగు బయటపడే సమయం ఆసన్నమైంది అని డిసెంబరు 4 నాటి పోస్టులో పేర్కొన్నారు.
విజయశాంతి పేర్కొన్నట్టే ఈ రెండు పార్టీలు తమ సఖ్యతను మరోసారి చాటుకున్నాయి. ఇవాళ జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు.