Rescue Operations: రిషిగంగ వద్ద పునఃప్రారంభమైన సహాయక చర్యలు
- ఉత్తరాఖండ్ లో విలయం
- తపోవన్ ప్రాజెక్టుపై విరుచుకుపడిన ధౌలిగంగా నది
- సొరంగంలో చిక్కుకుపోయిన 35 మంది
- సొరంగాన్ని కప్పేసిన బురద
- నదిలో నీటిమట్టం పెరగడంతో నిలిచిన సహాయక చర్యలు
ఉత్తరాఖండ్ లో తపోవన్ పవర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు పునఃప్రారంభమయ్యాయి. అంతకుముందు, రిషిగంగ వద్ద నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. పరిస్థితి అనుకూలంగా మారడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు.
ఇక్కడ ఓ సొరంగంలో 35 మంది వరకు చిక్కుకుపోగా, వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరద కారణంగా కొట్టుకొచ్చిన బురద ఈ సొరంగాన్ని కప్పేసింది. దాంతో ఆ బురద మట్టికి రంధ్రాలు చేసి ఆక్సిజన్ పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడి ధౌలిగంగా నది మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో అధికారుల చర్యలు ముందుకు సాగలేదు.
ఈ సొరంగం పొడవు ఒకటిన్నర కిలోమీటర్లు కాగా, 120 మీటర్ల మేర పూడిక తీయగలిగారు. బురదమట్టి క్రమేపీ గట్టిపడడంతో సమస్యాత్మకంగా మారింది. కాగా, ఈ వరద కారణంగా గల్లంతైన వారిలో 34 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 172 మంది జాడ తెలియరాలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.