Twitter: ఫేక్ న్యూస్ కట్టడిపై ట్విట్టర్, కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ఫేక్ న్యూస్ కట్టడికి తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశం
- ఏ రకమైన వ్యవస్థలు ఏర్పాటు చేశారని ప్రశ్న
- గత ఏడాది మేలో వ్యాజ్యం దాఖలు చేసిన బీజేపీ నేత
- ట్విట్టర్ తో గొడవ నేపథ్యంలో విచారణకు ప్రాధాన్యం
ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఫేక్ న్యూస్ కట్టడికి తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. ట్విట్టర్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు, దేశద్రోహ, అసభ్య పోస్టుల కట్టడి కోసం ఏ రకమైన వ్యవస్థలు ఏర్పాటు చేశారో చెప్పాలంటూ శుక్రవారం నోటీసులిచ్చింది.
నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తున్నారని, దానికి అడ్డుకట్ట వేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నేత వినీత్ గోయెంకా.. గత ఏడాది మేలో సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో వందలాది నకిలీ ఖాతాలున్నాయని, వాటి ద్వారా ప్రముఖ రాజకీయ నాయకుల పేరు ప్రఖ్యాతులను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే, తాజాగా ట్విట్టర్ , కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలోనే సుప్రీం కోర్టు ఈ వ్యాజ్యాన్ని విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, సోషల్ మీడియా నియంత్రణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. డిజిటల్ న్యూస్, ప్రసార మాధ్యమాలపై పలు ఆంక్షలను విధించింది. సమస్యాత్మక కంటెంట్ ఉంటే వెంటనే తీసేసేలా ఓ వ్యవస్థనూ ఏర్పాటు చేసింది.