Galla Jayadev: విభజన చట్టం హామీలు పూర్తిచేయాలని మరోసారి డిమాండ్ చేశాను: గల్లా జయదేవ్
- లోక్ సభలో సాధారణ బడ్జెట్ పై చర్చ
- కేంద్రం ఏపీని మర్చిపోయిందన్న గల్లా జయదేవ్
- 18 అంశాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని వెల్లడి
- వీటిలో ఏ ఒక్కటీ పూర్తిచేయలేదని ఆరోపణ
- వీడియో పంచుకున్న టీడీపీ ఎంపీ
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ఏపీ విభజన చట్టం హామీలపై గళం విప్పారు. నిన్న సాధారణ బడ్జెట్ పై చర్చ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి అమలు చేయాల్సిన వాటిలో 18 అంశాలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
వనరుల అంతరాన్ని పూరించడం, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ ఏర్పాటు, అమరావతికి కేంద్ర సాయం, పెట్రో కెమికల్ కాంప్లెక్సులో గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వ్యవస్థలు, అమరావతికి వేగవంతమైన రైలు, రహదారుల సంధానత, వెనుకబడిన జిల్లాలకు ఆర్థికసాయం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ స్థాపన, ప్రాధాన్యత ఉన్న జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజపట్నంలో గానీ, ఇప్పుడు అడుగుతున్న రామాయపట్నంలో గానీ పోర్టు ఏర్పాటు, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు తదితర అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని గల్లా జయదేవ్ ఆరోపించారు.
2014 నుంచి తాను ప్రతి ఏడాది ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నానని, వీటిలో ఒక్కటి కూడా కేంద్రం పూర్తిచేయలేదని తెలిపారు. కేంద్రం ఏపీని, రాష్ట్ర విభజన చట్టాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయిందని విమర్శించారు.