BJP: ముగ్గురు కశ్మీర్​ బీజేపీ కార్యకర్తల హత్య కేసులో ‘టీఆర్​ఎఫ్​’ ఉగ్రవాది అరెస్ట్​

Lashkar terrorist Zahoor Ahmad arrested suspected to be behind killings of 3 BJP workers in Kulgam

  • గత ఏడాది కలకలం సృష్టించిన బీజేపీ నేతల హత్య 
  • జహూర్ అహ్మద్ రథేడ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మరో పోలీస్ నూ చంపాడన్న పోలీస్ ఉన్నతాధికారి
  • బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలే లక్ష్యంగా టీఆర్ఎఫ్ ఏర్పాటు!

గత ఏడాది జమ్మూకశ్మీర్ లో కలకలం సృష్టించిన బీజేపీ నేతల హత్య కేసులో లష్కరే తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబా జిల్లాకు చెందిన జహూర్ అహ్మద్ రథేడ్ ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

‘‘అనంత్ నాగ్ పోలీసులు జహూర్ అహ్మద్ రథేడ్ అలియాస్ సాహిల్ అలియాస్ ఖాలిద్ ను ఫిబ్రవరి 12 అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. హత్యల తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే, పక్కా సమాచారం అందుకున్న అనంత్ నాగ్ పోలీసులు జహూర్ ను అదుపులోకి తీసుకున్నారు’’ అని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. జహూర్.. లష్కరే తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ అయిన టీఆర్ఎఫ్ కు చెందిన వాడని చెప్పారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలతో పాటు దక్షిణ కశ్మీర్ జిల్లాలోని ఫుర్రాలో ఓ పోలీస్ అధికారినీ చంపాడని తెలిపారు.

గత ఏడాది అక్టోబర్ 29న కుల్గాం జిల్లాలోని వెసూలో బీజేపీ కార్యకర్తలు ఫిదా హుస్సేన్, ఉమర్ రషీద్ బేగ్, ఉమర్ హాజమ్ ల హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వారు ముగ్గురు కారులో వెళుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురూ ఆసుపత్రికీ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు.

ఏంటీ టీఆర్ఎఫ్?

2019లో కేంద్ర ప్రభుత్వం 370వ అధికరణాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా పోయింది. ఈ నేపథ్యంలోనే లష్కరే తాయిబా సహా వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులతో సరిహద్దుల్లో టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేసి ఉంటారని బలగాలు భావిస్తున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు, పలు గ్రూపులకు చెందిన స్వచ్ఛంద కార్యకర్తలే లక్ష్యంగా ఆ గ్రూపును ఏర్పాటు చేసినట్టు చెబుతున్నాయి. గత ఏడాది చాలా మంది రాజకీయ నాయకులపై టీఆర్ఎఫ్ దాడులకు తెగబడింది. 11 మంది రాజకీయ నాయకులను హత్య చేయగా.. అందులో 9 మంది బీజేపీ కార్యకర్తలే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News