Senete: సెనేట్ లో వీగిపోయిన ట్రంప్ అభిశంసన తీర్మానం!
- 57-43 తేడాతో ఓడిపోయిన తీర్మానం
- సెనేట్ లో పూర్తి బలాన్ని పొందలేకపోయిన డెమొక్రాట్లు
- తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పిన ట్రంప్
అమెరికాలో రెండోసారి అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న అధ్యక్షుడిగా తొలిసారి నిలిచిన డొనాల్డ్ ట్రంప్, రెండోసారి కూడా బయటపడ్డారు. ఐదు రోజుల సుదీర్ఘ చర్చ అనంతరం సెనేట్ ఆయనపై అభిశంసన తీర్మానాన్ని తోసిపుచ్చింది. ఆయనపై వచ్చిన అభియోగాల నుంచి విముక్తిని ప్రసాదించింది. ట్రంప్ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగగా, బలమైన రిపబ్లికన్లు విజయం సాధించారు. ఈ తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది.
అమెరికా కాపిటల్ హౌస్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి తీవ్ర కలకలం రేపగా, జో బైడెన్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన డెమొక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందగా, సెనేట్ లో మాత్రం వీగిపోయింది. తొలుత రిపబ్లికన్ల నుంచి ట్రంప్ పై వ్యతిరేకత కనిపించినప్పటికీ, ఆపై ఆయన్ను అభిశంసిస్తే, తమ పార్టీకి నష్టమేనని వారంతా భావించడంతో ట్రంప్ తప్పించుకున్నారు.
సెనేట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తేనే అభిశంసన తీర్మానం ఆమోదం పొంది ఉండేది. ఏడుగురు రిపబ్లికన్లు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ట్రంప్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదం పొందే బలాన్ని డెమొక్రాట్లు పొందలేకపోయారు.
ఇక ఈ తీర్మానం వీగిపోవడంపై ట్రంప్ స్పందిస్తూ, సెనేట్ తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అమెరికా చరిత్రను వేధించిన మరో ఘటనకు సంబంధించిన అంశాలను ప్రజలు ఇక మరచి పోవచ్చని ఆయన అన్నారు. అమెరికా రాజకీయ భవిష్యత్తు మరోసారి మారుతుందన్న సంకేతాలు ఈ తీర్పుతో వెలువడ్డాయని ఆయన అన్నారు. తన దేశం మరోసారి గొప్పగా నిలిచిందని అన్నారు.