Asaduddin Owaisi: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రమాదం: ఒవైసీ
- జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మాట్లాడిన అసదుద్దీన్
- చెన్నై, బెంగళూరు, ముంబైని కూడా యూటీగా చేస్తారని వ్యాఖ్య
- జమ్మూకశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని మండిపాటు
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై నిన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్ర సర్కారు ఈ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్‌నే కాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలన ఇలాగే ఉంటుందని చెప్పారు. జమ్మూకశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని తెలిపారు. ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు, సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు తిరిగి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కాగా, తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిన్న ముగిశాయి. తిరిగి మార్చి 8న ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.