Raja Singh: బారిస్టర్ చదివిన అసదుద్దీన్ ఒవైసీకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా?: రాజా సింగ్
- లోక్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఒవైసీ
- హైదరాబాద్ ను యూటీ చేస్తారంటూ వ్యాఖ్యలు
- అసద్ వ్యాఖ్యలను ఖండించిన రాజా సింగ్
- ఒవైసీకి బుద్ధి లేదంటూ ఆగ్రహం
- విభేదాలు సృష్టించేలా మాట్లాడుతుంటాడని వెల్లడి
దేశంలో హైదరాబాదు సహా పలు నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు. చెన్నై, ముంబయి, బెంగళూరుతో పాటు అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే ఉద్దేశం కేంద్రానికి లేదని, అసదుద్దీన్ మాటలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. అసద్ వ్యాఖ్యలు రాజకీయ పార్టీలను రెచ్చగొట్టేలా ఉన్నాయని రాజా సింగ్ విమర్శించారు.
అసలు, అసదుద్దీన్ ఒవైసీకి బుద్ధి ఉందా లేదా? ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా? అని మండిపడ్డారు. బారిస్టర్ చదివినప్పటికీ అసదుద్దీన్ ఒవైసీకి జ్ఞానం రాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో కేంద్ర పాలిత ప్రాంతాలపై చర్చ లేకుండానే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశాడని, ఎప్పుడు నోరు విప్పినా విభేదాలు సృష్టించేలా మాట్లాడుతుంటాడని రాజాసింగ్ అన్నారు. మీడియాలో అందరూ తన గురించే మాట్లాడుకోవాలన్న అల్పబుద్ధితో వ్యాఖ్యలు చేస్తుంటాడని విమర్శించారు.