Krishna District: ఓటు వేసి వచ్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘ఆమె’ గెలిచింది!
- నిండుగర్భిణిగా ఉంటూనే ప్రచారం
- పోలింగ్ రోజున ఓటువేసి వచ్చి పాపకు జన్మనిచ్చిన లీల
- మండలంలో అందరికంటే అత్యధిక మెజారిటీ
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన లీలా కనకదుర్గ విజయం సాధించింది. మహిళ విజయం సాధించడంలో విశేషం ఏముంది? అన్న అనుమానం వస్తే మీరిది పూర్తిగా చదవాల్సిందే. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లుకు చెందిన లీలా కనకదుర్గ జనసేన, టీడీపీ మద్దతుతో గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగింది. ఆమె భర్త మహేశ్ ఆటో డ్రైవర్ కాగా, వారికి రెండేళ్ల పాప ఉంది.
ఆమె నోటిఫికేషన్ వేసిన తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా, మరోమారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, లీల నిండు గర్భిణి కావడంతో గతంలో ఆమెకు మద్దతు ఇచ్చిన పార్టీల నుంచి స్పందన లేదు. అయినప్పటికీ ఆమె ధైర్యంగా ముందుకొచ్చింది. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది. దీంతో వారు సరేననక తప్పలేదు.
నామినేషన్ వేసిన లీల తాను ఏ క్షణాన అయినా ప్రసవించే అవకాశం ఉందని తెలిసీ తెగువ ప్రదర్శించింది. తన గుర్తు ‘బుట్ట’ను పట్టుకుని ఇంటింటికీ వెళ్లి తనకు తానుగా ప్రచారం చేసుకుంది. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తాను చేయబోయేదేంటో ప్రజలకు వివరించింది.
ఈ లోగా ఎన్నికలు సమీపించాయి. పోలింగ్ రోజున నొప్పిని భరిస్తూ ఉదయాన్నే ఓటు వేసి ఇంటికెళ్లింది. ఆ తర్వాత కాసేపటికే పురిటినొప్పులు రావడంతో కైకలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడామె పండంటి పాపకు జన్మనిచ్చింది. మరోవైపు, మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆమె ఏకంగా 689 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తన మండలంలో గెలిచిన ఇతర అభ్యర్థుల కంటే ఆమె మెజారిటీనే ఎక్కువ కావడం గమనార్హం.