Nara Lokesh: పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటున్నారు
- ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటున్నారు
- జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు
- డోర్ డెలివరీ మాయలోడు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేషన్ బియ్యం, సరుకులు ఇచ్చే చౌకధరల దుకాణం వద్ద ప్రజలు క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడకుండా చేసేందుకు, సరుకుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తొలగించడానికి ఏపీ సర్కారు రేషన్ డోర్ డెలివరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, వాటి వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
'పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే. సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
'డోర్ డెలివరీ మాయలోడు వైఎస్ జగన్ కనపడితే సన్న గడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మలు క్యూలో రెడీగా ఉన్నారు' అని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.