BTech Ravi: కడప జిల్లా వైసీపీ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీటెక్ రవి
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీని ఆశ్రయించిన బీటెక్ రవి
- టీడీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారని ఆరోపణ
- పులివెందులలో పరిస్థితులు దారుణమని వెల్లడి
- ఏకగ్రీవాలకు ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు
- పోటీ చేసినవాళ్ల పంటలు ధ్వంసం చేస్తున్నారని వివరణ
కడప జిల్లాలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ మద్దతుదారులను, ఓటర్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని, వారి పంటలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
పైడిపాళెం, పెద్ద జూటూరు, మల్లేల, దుగ్గన్నగారిపల్లె తదితర పంచాయతీల్లో వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారని, ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వివరించారు. ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ ఫిర్యాదు పట్ల ఎస్పీ స్పందించారని బీటెక్ రవి తెలిపారు. షాడో బృందాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.