Kamala Harris: కమలా హారిస్ ఇమేజ్ ను వాడుకోవద్దు: మీనా హారిస్ కు వైట్ హౌస్ హితవు

White House warns Meena Harris to stop using Kamala Harris name

  • కమలా హారిస్ సోదరి కుమార్తె మీనా హారిస్
  • కమల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన మీనా
  • 'ఫినామినల్' అనే వస్త్రాల బ్రాండ్ ను నిర్వహిస్తున్న మీనా

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ పేరును, పరపతిని వాడుకున్నందుకు ఆమె బంధువు మీనా హారిస్ పై వైట్ హౌస్ అభ్యంతరం తెలిపినట్టు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం ఉపాధ్యక్షురాలిని ఉపయోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది.

మీనా హారిస్ (36) కమలా హారిస్ సోదరి కుమార్తె. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి కమలా హారిస్ తరపున ఆమె విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మీనా... 'కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా' తదితర పుస్తకాలను రచించారు. 'ఫినామినల్' అనే వస్త్రాల బ్రాండ్ కు ఆమె వ్యవస్థాపకురాలు. అయితే తమ బ్రాండ్ వస్త్రాలపై 'వైస్ ప్రెసిడెంట్ ఆంటీ' అని ముద్రించడం వివాదాస్పదమైంది.

మరోవైపు కమలాహారిస్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఆమె ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించడం విమర్శలకు తావిచ్చింది. వీటి నేపథ్యంలో, వ్యక్తిగత కార్యకలాపాలకు ఉపాధ్యక్షురాలి పేరును వాడొద్దని వైట్ హౌస్ లాయర్లు ఆమెకు సూచించారు. ఉపాధ్యక్షురాలి బంధువుగా పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా ఆమెకు వివరించారు. ఈమేరకు అమెరికా మీడియా పేర్కొంది.

మరోవైపు దీనిపై మీనా హారిస్ స్పందిస్తూ... ఎన్నికల ప్రచారం నాటి నుంచి తాను అన్ని నియమాలను, నిబంధనలను పాటించానని చెప్పారు. తమ వెబ్ సైట్ల నుంచి ఉపాధ్యక్షురాలికి సంబంధించిన అంశాలు, ఆమె పేర్లు, ఆమెను పోలిన చిహ్నాలను తొలగించినట్టు తెలిపారు. తమ వస్తువుల ప్రచారంలో కమలా హారిస్ పేరును వాడబోమని చెప్పారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో మీనా హారిస్ కు 8 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News