Sunil Gavaskar: అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయేం?: ఇంగ్లండ్ ఆటగాళ్లకు గవాస్కర్ కౌంటర్
- చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కు కష్టాలు
- పిచ్ బాగాలేదంటున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు
- మరి రోహిత్ 150కి పైగా పరుగులు ఎలా చేశాడన్న గవాస్కర్
- వీళ్లకు భారత్ అంటే నచ్చదని వ్యాఖ్యలు
చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు పిచ్ పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తుండడం పట్ల భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ దీటుగా బదులిచ్చారు. ఇంగ్లండ్ లో పిచ్ లపై బంతి రోజంతా స్వింగ్ అవుతూనే ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఓసారి ఆస్ట్రేలియా 46 పరుగులకు ఆలౌటైందని వెల్లడించారు. మరి ఇంగ్లండ్ మాజీలు అప్పుడెందుకు పిచ్ నాణ్యతపై స్పందించలేదని గవాస్కర్ నిలదీశారు. అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయంటూ కెవిన్ పీటర్సన్, మైకేల్ వాన్ వంటి ఆటగాళ్లపై ధ్వజమెత్తారు.
భారత్ లో బంతి తిరగడం ప్రారంభిస్తే చాలు వీళ్లు వ్యాఖ్యలు చేయడం ప్రారంభిస్తారని విమర్శించారు. వీళ్లకు భారత్ అంటే నచ్చదు అని గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చర్చించాల్సింది పిచ్ గురించి కాదని.... బౌలర్లు, బ్యాట్స్ మెన్ నైపుణ్యంపై మాట్లాడాలని హితవు పలికారు. ఇంగ్లండ్ కు అంత కష్టసాధ్యంగా కనిపిస్తున్న పిచ్ పై రోహిత్ శర్మ 150కి పైగా పరుగులు ఎలా చేశాడని ప్రశ్నించారు.
తొలి టెస్టులోనూ ఇలాంటి వ్యాఖ్యలే వినిపించాయని, తొలి రెండు రోజులు బ్యాటింగ్ కు అనుకూలించినప్పుడు, విసుగెత్తించే పిచ్ అన్నారని, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ఇంగ్లండ్ మాజీలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.