India: ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. రెండో టెస్టులో 317 పరుగుల తేడాతో భారీ విజయం
- తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులు
- రెండో ఇన్నింగ్స్‌లో 286
- తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134 పరుగులు
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 164
- ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా చెన్నైలో జరిగిన రెండో టెస్టులో కసి తీర్చుకుంది. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. వారికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితం... టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, కెప్టెన్ రూట్ 33, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 , మోయీన్ అలీ 43, స్టోన్ 0, బ్రాడ్ 5 పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టి టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో అదరగొట్టిన అశ్విన్‌పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 26, శుభ్‌మన్ గిల్ 14, పుజారా 7, కోహ్లీ 62, పంత్ 8, రహానె 10, అక్షర్ పటేల్ 7, అశ్విన్ 106 కుల్దీప్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 7, సిరాజ్ 16 పరుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు.