Puduchcherry: 'ఆపరేషన్ లోటస్' పుదుచ్చేరికి కూడా చేరింది: సీఎం నారాయణ స్వామి

Operation Lotus Comes to Puduchcherry says CM Narayanaswamy

  • ప్రభుత్వాలను అస్థిర పరచడమే బీజేపీ లక్ష్యం
  • పుదుచ్చేరిలో అమలు చేయాలని చూస్తున్నారు
  • మల్లాడి మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నా
  • రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న వి.నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ లు రాజీనామా చేసిన విషయమై 'ఎన్డీటీవీ'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వమేమీ మైనారిటీలో పడలేదని ఆయన స్పష్టం చేశారు.

"వారిద్దరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించాల్సి వుంది. ఆపరేషన్ లోటస్ ను బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రారంభించింది. ఆది నుంచి చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇదే చేస్తోంది. ప్రభుత్వాలను అస్థిరపరచడం వారి లక్ష్యం. అదే వ్యూహాన్ని పుదుచ్చేరిలో కూడా అమలు చేయాలని చూస్తోంది" అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉన్న వేళ, ఇప్పటివరకూ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

గత నెల 25న ఎ.నమశ్శివాయం, ఇ. తిప్పయిజన్ రాజీనామా చేయగా, తాజాగా మరో ఇద్దరు చేశారు. ప్రస్తుతం అధికార, విపక్ష బలం సమానంగా ఉంది. ఐదు రోజుల క్రితం నారాయణస్వామి, మల్లాడి కృష్ణారావులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాలని కోరారు కూడా.

"మల్లాడి కృష్ణారావును కిరణ్ బేడీ ఎన్నో మార్లు వేధించారు. తన నియోజకవర్గానికి చెందిన ఏ అభివృద్ధి పనితో వచ్చినా, ఆమె అడ్డుకున్నారు. నాలుగేళ్ల పాటు ఆయన ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు. రోజువారీ పాలనలో కల్పించుకుంటున్న ఆమె ఎన్నో సమస్యలను సృష్టించారు. ఈ సంగతి రాష్ట్రంలోని ప్రజలకు కూడా తెలుసు. నాలుగేళ్ల తొమ్మిది నెలల పాటు ఎంతో కష్టంతో ప్రభుత్వాన్ని లాక్కొచ్చాము" అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందని, వారిని బెదిరిస్తోందని, బీజేపీ తీరు తనకు చాలాకాలంగా తెలుసునని వ్యాఖ్యానించిన నారాయణ స్వామి, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఏ హామీనీ ఆ పార్టీ నిలుపుకోలేదని, పుదుచ్చేరిలో వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఇప్పటికీ కృష్ణారావు తనతోనే ఉన్నారని, ఆయన మనసు మార్చుకుంటారనే భావిస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News