Corona Virus: దేశంలో అందుబాటులోకి రానున్న మరో టీకా.. 'స్పుత్నిక్-వి' అత్యవసర అనుమతికి డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నాలు
- భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం సన్నాహాలు
- రెండు, మూడో దశల మధ్యంతర పరీక్షల సమాచారం డీసీజీఐకి అందజేత
- కరోనాపై 91.6 శాతం ప్రభావశీలత
భారత్‌లో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో టీకా అందుబాటులోకి రాబోతోంది. రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అత్యవసర వినియోగ అనుమతులు పొందేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా రెండు, మూడో దశల క్లినికల్ పరీక్షల మధ్యంతర సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి అందించింది. 91.6 శాతం ప్రభావశీలత కలిగిన ఈ టీకా కనుక అందుబాటులోకి వస్తే ఆసియాలో అత్యంత ప్రభావశీల వ్యాక్సిన్ ఇదే అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 90 శాతానికి పైగా ప్రభావశీలత కలిగిన మూడు టీకాల్లో ‘స్పుత్నిక్-వి’ టీకా ఒకటని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో వినియోగానికి ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు వచ్చాయి. ఇప్పటి వరకు 20 లక్షల మందికి ఈ టీకాను వేశారు.