CPI Ramakrishna: విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని ఆ మీటింగులోనే నిర్ణయించారా? లేదా?: సోము వీర్రాజును నిలదీసిన సీపీఐ రామకృష్ణ
- హిందూత్వాన్ని పక్కనపెట్టేందుకేనని అంటారా?
- చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి మాటలు
- బీజేపీ కుట్రలను ప్రజలు సహించరు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు తమ చేతకాని తనాన్ని పక్కనపెట్టేందుకు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూత్వాన్ని పక్కనపెట్టేందుకే విశాఖ ఉక్కు ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చారని సోము వీర్రాజు చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
వీర్రాజుకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. మోదీ అధ్యక్షతన ఎకనమిక్స్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగిన విషయం వాస్తవమా? కాదా? చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని ఆ సమావేశంలోనే మోదీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. విశాఖ ఉక్కుపై బీజేపీ కుట్రలను ప్రజలు ఇంక ఎంతమాత్రమూ క్షమించబోరని రామకృష్ణ హెచ్చరించారు.