Nirmala Sitharaman: ఏం జవాబు చెబితే ఏమనుకుంటారో... పెట్రో ధరల పెంపుపై నిర్మలా సీతారామన్ స్పందన
- దేశంలో పెట్రో మంట.. ఇంధన ధరలు పైపైకి!
- చిరాకు పుట్టించే అంశమన్న నిర్మల
- తానేది మాట్లాడినా తప్పించుకునే ధోరణిలాగే అనిపిస్తుందని విచారం
- ధర్మ సంకట స్థితిని ఎదుర్కొంటున్నట్టు వివరణ
దేశంలో చమురు ధరలు భగ్గుమంటుండడం పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇదొక చిరాకు పుట్టించే అంశం అని వ్యాఖ్యానించారు. దీనికి ఎలాంటి జవాబు ఇవ్వలేమని అన్నారు. ధరలు తగ్గించడం ద్వారానే సంతృప్తి కలిగించగలమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఏది మాట్లాడినా జవాబు దాటవేసేలా, తప్పును మరొకరిపై నెట్టేలా ధ్వనిస్తుందని నిర్మల పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదేనని వివరించారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వలేక ధర్మ సంకటంలో పడుతున్నానని అన్నారు.
దేశంలో ఇంధన ధరలు సముచిత ధరలకే అందుబాటులోకి వచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు ఏదో ఒక మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చమురు ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వాటిని నియంత్రించలేకపోతోందని నిస్సహాయత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే పెట్రో ధరలను నిర్ణయిస్తున్నాయని తెలిపారు. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలు పాటించే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని ఆర్థికమంత్రి వెల్లడించారు.