Venkaiah Naidu: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు!

venkaiah wishes on motherlanguage day

  • అవసరానికి అన్ని భాషలు నేర్చుకోవచ్చు
  • మాతృభాషను కాపాడుకునేందుకు ఉద్యమించాలి: వెంక‌య్య
  • మాతృభాష అంటేనే మన ఉనికి: జ‌గ‌న్
  • పుడుతూనే దక్కే వారసత్వ సంపద మాతృభాష: చ‌ంద్ర‌బాబు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారికి ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. బాధ కలిగినప్పుడు నిద్రలో సైతం మనం పలికేదే మాతృభాష అని, నువ్వు ఎవరు అని రేపటి తరాలు అడిగే ప్రశ్నకు సమాధానమే అమ్మభాష అని ఉప రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు అన్నారు. భాష కేవలం మాట్లాడుకోవడం కోసమే కాదని, మన గతమేంటో, మనం ఎక్కణ్నుంచి వచ్చామో, మన సంస్కృతి ఏమిటో తెలుసుకోవడానికి కూడా అని ఆయ‌న చెప్పారు.

'అవసరానికి అన్ని భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను కాపాడుకునేందుకు అందరూ కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మన పునాదులు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఒక మహత్తర భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడానికి మించిన గర్వకారణం ఏముంటుంది. ఎందుకంటే భాష మన సంస్కృతికి జీవనాడి. ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుంది. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తిమంతమవుతాయి' అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

'మన తెలుగు కుటుంబాలు ముందుగా తెలుగును తమ ఇంటా వంటా అలవర్చుకోవాలి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. తమ పిల్లలకు  తెలియజేయాలి. తెలుగు కళలు,సాహిత్యం గొప్పతనాన్ని వారికి వివరించాలి' అని వెంకయ్య నాయుడు చెప్పారు.

'మాతృభాష పట్ల మమకారం, అంకిత భావం లేకపోతే,  ప్రాణప్రదంగా భావించలేకపోతే భాషను కాపాడుకోలేము. ఈ విషయంలో ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది' అని ఆయ‌న చెప్పారు.

దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందిస్తూ... 'మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత' అని  ట్వీట్‌ చేశారు.

ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్లు చేశారు. 'ప్రతి ఒక్కరికీ పుడుతూనే దక్కే వారసత్వ సంపద మాతృభాష. శ్రీ కృష్ణ దేవరాయల వంటి స్వదేశీయుల నుండి సి.పి.బ్రౌన్ వంటి విదేశీయులను కూడా ఆకర్షించిన తెలుగు భాష, వైసీపీ పాలకుల దృష్టిలో చులకనవడం దురదృష్టకరం' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

'ఇతర భాషలను నేర్చుకోడానికి పునాది మాతృభాష. ఆ పునాదినే లేకుండా చేసి గాలిలో మేడలు కడతామనేవారిని ఏమనాలి? ఆంగ్ల మాధ్యమానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదు. ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉండాలన్నదే తెలుగుదేశం అభిమతం' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News