Jagan: ఉత్తమ పనితీరు కనబరిచే వలంటీర్లకు ఉగాది రోజున సత్కారం: సీఎం జగన్
- ప్రణాళిక శాఖపై సీఎం జగన్ సమీక్ష
- వలంటీర్లను ప్రోత్సహించాలని నిర్ణయం
- పనితీరు ఆధారంగా సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు
- లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచన
రాష్ట్ర ప్రణాళిక శాఖపై ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వలంటీర్ల అంశాన్ని చర్చించారు. రాష్ట్రంలో ఉత్తమ పనితీరు కనబరిచే వలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందిస్తున్న వలంటీర్లను తప్పకుండా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారు అందించిన సేవల స్థాయిని బట్టి సేవారత్న, సేవామిత్ర వంటి పురస్కారాలతో గౌరవించాలని సూచించారు.
ఇక, ఇతర అంశాల గురించి ప్రస్తావిస్తూ... ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయా? అని అధికారులను అడిగారు. దీనిపై అధికారులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని సీఎం వారికి పలు సూచనలు చేశారు. సుస్థిర గ్రామాభివృద్ధి కోసం లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితితో పాటు దాని అనుబంధ విభాగాలు, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు.