Mumbai: ఎంతటి వారైనా జాలి, దయ చూపించం: బీఎంసీ కమిషనర్​

will be ruthless on those flouting corona norms warns BMC Chief

  • కరోనా నిబంధనలను పాటించకపోతే కేసులు పెడతామని హెచ్చరిక
  • పెళ్లిళ్లలోనూ అందరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే
  • లేదంటే వధువు, వరుడు తల్లిదండ్రులపైనా పోలీసు కేసులు
  • వచ్చే 12 రోజులు చాలా కీలకమన్న కమిషనర్
  • మాస్కు పెట్టుకోని వారికి రూ.200 జరిమానా

మాస్కులు పెట్టుకోవాలని, కరోనా రూల్స్ పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా అక్కడి జనాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్లలో మార్షల్స్ ను పెట్టింది ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ). అయినాగానీ తీరు మారకపోవడంతో ఇక, కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది.

కరోనా నిబంధనలను ఉల్లంఘించినవారు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని, జాలిదయ చూపించేది లేదని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ హెచ్చరించారు. నిబంధనలను పాటించని వారిపై పోలీస్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లిళ్లలోనూ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపించినా వారితో పాటు వధువు, వరుడు తల్లిదండ్రులపైనా కేసులు పెడతామన్నారు. శుభకార్యాలు, బర్త్ డే పార్టీల్లో 50 మందికి మించి బంధువులను పిలుచుకోవద్దని చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు.

వచ్చే 12 రోజులు చాలా కీలకమని ఆయన చెప్పారు. లోకల్ ట్రైన్లు మొదలైనందువల్ల కొత్త రకం కరోనా కేసులూ పెరిగే ముప్పు పొంచి ఉందని అన్నారు. పోలీసులు, మార్షల్స్ ఎక్కడికక్కడ నిఘా వేస్తారని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తారని ఆయన చెప్పారు.

మాస్క్ పెట్టుకోని వారికి బీఎంసీ రూ.200 జరిమానాను విధించనుంది. ట్విట్టర్ లో దీనిపై ప్రకటన చేసింది. ‘‘ఒక్క నిమిషం సౌకర్యాన్ని చూసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కరోనా సోకకుండా ఉండాలంటే మాస్కు పెట్టుకోండి. భద్రతే అమూల్యమైనది’’ అంటూ పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News