USA: ట్రంప్​ తెచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసిన బైడెన్​

Biden admin scraps stringent citizenship test reverts to 2008 version

  • 2008 పద్ధతిలోనే సివిక్స్ టెస్ట్ రాయొచ్చని వెల్లడి
  • ప్రకటన జారీ చేసిన యూఎస్ సీఐఎస్
  • 2020 రూల్ ప్రకారం సన్నద్ధమవుతున్న వారికి మినహాయింపు
  • ట్రంప్ తెచ్చిన రూల్ ప్రకారం టెస్ట్ రాసేందుకు వెసులుబాటు
  • ఈ ఏడాది మార్చి 1 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పాత పద్ధతిలోనే చాన్స్

డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది తెచ్చిన పౌరసత్వ పరీక్షను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. అర్హులైన అభ్యర్థులందరికీ పౌరసత్వం ఇచ్చేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేస్తామని ఆయన సర్కార్ ప్రకటించింది. అమెరికా పౌరులు కావాలనుకునే వారు ఇంగ్లిష్ అర్థం చేసుకుని, సివిక్స్ పరీక్షలో పాస్ అయితే చాలన్న పాత నిబంధనలనే మళ్లీ తీసుకొచ్చారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) దీనిపై ప్రకటన జారీ చేసింది.

గత ఏడాది డిసెంబర్ లో తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల పౌరసత్వం ఇచ్చే ప్రక్రియలో సహజత్వం దెబ్బతింటుందని, దీంతో దానిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అయితే, ఇప్పటిదాకా కొత్త పద్ధతిలో పరీక్షకు సన్నద్ధమవుతున్న వారి కోసం ఏప్రిల్ 19 దాకా ‘ట్రంప్’ రూల్ ప్రకారమే పరీక్ష రాయొచ్చని, 2021 మార్చి 1 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 2008 పద్ధతి ప్రకారం పరీక్ష రాయొచ్చని యూఎస్ సీఐఎస్ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారతీయులే ఎక్కువగా లాభం పొందనున్నారు. 

కాగా, ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. వంద ప్రశ్నలను 138కి పెంచారు. అందులో చాలా వరకు రాజకీయ ప్రశ్నలే ఎక్కువగా ఉంటున్నాయన్నది అభ్యర్థులు చెబుతున్న మాట. దాంతో పాటు ఈ పరీక్ష చాలా క్లిష్టంగా మారిందన్న అభిప్రాయాలున్నాయి. 2020 డిసెంబర్ 1 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారు కొత్త సివిక్స్ టెస్ట్ నే రాయాల్సి ఉంటుందని ట్రంప్ అప్పట్లో ఉత్తర్వులిచ్చారు.

  • Loading...

More Telugu News